జగన్ కామెంట్స్ సత్య కుమార్ సీరియస్
నవ్వుతూ కాకుండా ఏడుస్తూ చెప్పాలా
అమరావతి – ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం జగన్ రెడ్డికి , ఆయన పరివారానికి అలవాటుగా మారిందన్నారు.
చావు పరామర్శలకు వెళ్లినా నవ్వుతూ పలకరించే మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలో తాను నవ్వుతూ సమాధానం చెప్పానని దానిని వక్రీకరించే ప్రయత్నం చేస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు సత్య కుమార్ యాదవ్.. చట్ట సభల్లో నవ్వుతూ కాకుండా ఏడుస్తూ సమాధానాలు చెప్తారా? అని నిలదీశారు.
విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లుగా మంచినీటి పైపు లైన్ల నిర్వహణ పూర్తిగా విస్మరించడం , పేదలకు టాయిలెట్లు కట్టక పోవడం వల్ల చంపా నదీ తీరంలో బహిరంగ మల విసర్జన వలన నీటి కాలుష్యం ఏర్పడిందన్నారు మంత్రి సత్య కుమార్ యాదవ్.
గత ఐదేళ్లుగా నీటి ట్యాంకులు శుభ్రం చేయక పోవడం, కనీసం క్లోరినేషన్ కూడా చేయక పోవడం దారుణమన్నారు. కేంద్ర నిధులతో జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన నీరు అందించే ప్రయత్నం చేయక పోవడం వల్లనే ఇలా జరిగిందని పేర్కొన్నారు.
15 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా, పదేళ్లు మంత్రిగా ఉన్న బొత్సా ఈ దారుణ పరిస్థితులకు కారణం కాదా? కనీస బాధ్యత లేదా? అని తాను మండలిలో గుర్తు చేశానని అన్నారు సత్య కుమార్ యాదవ్.