ప్రకృతితోనే మనిషి మనుగడ – షిండే
కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిదీ
అమరావతి – ప్రముఖ విలక్షణ నటుడు షాయాజీ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మర్యాద పూర్వకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు. మరాఠాలో తాము ఆలయాలలో ప్రసాదంతో పాటు మొక్కులు కూడా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇదే తరహాలో ఇక్కడ కూడా ప్రసాదంతో పాటు మొక్కులు పంపిణీ చేస్తే పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుందని స్పష్టం చేశారు. ఈ సూచన గొప్పగా ఉందంటూ కితాబు ఇచ్చారు పవన్ కళ్యాణ్ .
డిప్యూటీ సీఎంతో భేటీ అనంతరం షాయాజీ షిండే మీడియాతో మాట్లాడారు. మనిషి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉంది. ప్రపంచంలో ఏ మత ధర్మం అయినా ప్రకృతిని సంరక్షించుకుంటేనే భవిష్యత్తు అని బోధిస్తున్నాయి.
వచ్చే తరాలకు సుందరమైన పర్యావరణం అందించాలంటే చిన్న నాటి నుంచే నేటి తరానికి మొక్కల విశిష్టతను తెలపాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం ఆలయాలకు పూజల నిమిత్తం వచ్చే భక్తులకు ప్రసాదంతో పాటు మొక్కలను అందించి వాటిని పెంచేలా ప్రోత్సహించాలని సూచించారు.
ఈ ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. మహారాష్ట్రలో సిద్ధి వినాయక ఆలయం, దగదుశేథ్ గణపతి ఆలయం, మహాలక్ష్మి ఆలయాల్లో వృక్ష ప్రసాద్ యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు.
విరివిగా మొక్కలను నాటడం తన జీవన అలవాట్లలో భాగం అయ్యిందని చెప్పారు. నా తల్లి కన్ను మూసినప్పుడు ఆమె బరువుకు సరితూగే విత్తనాలను చాలా ప్రాంతాల్లో నాటానని అన్నారు షిండే.
దేవాలయాలకు వెళ్లే భక్తులకు ప్రసాదాలతో పాటు మొక్కలను దేవుడు ఇచ్చిన బహుమతిగా అందిస్తే వాటిని వారు నాటడం, సంరక్షించడం దైవ కార్యంగా భావిస్తారని అన్నారు. ఆధ్యాత్మికతకు పర్యావరణ శక్తి కలిస్తే భావి తరాలకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు షిండే.