ఏపీలో రైళ్లు పారా హుషార్
గుండ్లకమ్మ ..దర్శి రైల్వే లైన్ షురూ
అమరావతి – ఏపీలో ఇక రైళ్లు రయ్ అంటూ వెళ్లనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో భారీ ఎత్తున కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తోంది. తాజాగా భారీ ఎత్తున ఖర్చు చేసిన గుండ్ల కమ్మ – దర్శి మధ్య రైల్వే లైన్ ను ప్రారంభించింది. నడికుడి – శ్రీకాళహస్తి సెక్షన్ మధ్య 27 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని నిర్మించారు. దీంతో రైళ్ల రాక పోకలకు మార్గం ఏర్పడింది.
విద్యుదీకరించని రైలు విభాగంలోని రైళ్లు గరిష్టంగా 75 కి.మీ వేగం తో నడపడానికి అనుమతించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఏపీలో చేపట్టిన ముఖ్యమైన, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఇది ఒకటి అని పేర్కొంది.
ఈ రైల్వే లైన్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల లోని పరిసర ప్రాంతాలు కలుపుతూ వెళుతుందని తెలిపింది. ఈ ప్రాజెక్టు 2011-12 సంవత్సరంలో 309 కి.మీ.ల మేర రూ. 2,289 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా తొలి దశ కింద పిడుగురాళ్ల – శావల్యపురం వరకు 47 కి. మీ రైల్వే లైన్ ను నిర్మించడం జరిగిందని పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే. రెండో దశ కింద 27 కి. \మీ రైల్వే లైన్ గుండ్లకమ్మ, దర్శి మధ్య ప్రారంభించినట్లు తెలిపింది.
ఇక మూడో దశలో దర్శి – కనిగిరి మధ్య 52 కి.మీ, వెంకటగిరి – ఆల్తూరిపాడు మధ్య 115 కి.మీ., నాలుగో దశ కింద కనిగిరి – పామూరు మధ్య 35 కి.మీ, అట్లూరిపాడు – వెంకటాపురం మధ్య 43 కి.మీ, ఐదో దశ కింద పామూరు – ఓబులాయపల్లె – వెంకటాపురం మధ్య 90 కి.మీ. రైల్వే లైన్లను నిర్మించనున్నట్లు వెల్లడించింది దక్షిణ మధ్య రైల్వే .