ప్రపంచ వ్యాప్తంగా జయంతి వేడుకలు
అమరావతి – విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పుట్టిన రోజు ఇవాళ. మే 28న ఆయన బర్త్ డే కావడంతో ప్రపంచ వ్యాప్తంగా జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. తాను స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కడప వేదికగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. వేలాదిగా పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీఆర్ మాదిరి నటుడు దేశంలో లేరన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సినిమాలు చేసిన మహానుభావుడంటూ కొనియాడారు. ఈ తరం యువత ఎన్టీఆర్ జీవితాన్ని తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకేసారి మూడు పాత్రల్లో దాన, వీర, శూరకర్ణ పాత్రలు పోషించి అబ్బుర పరిచారంటూ ప్రశంసలు కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందనే ఆవేదనతో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ఎండల్లో తిరుగుతూ ప్రజలను కలసి అఖండ విజయాన్ని సాధించారని అన్నారు. పాలన ప్రారంభంలో విమర్శలు వచ్చినా, ప్రజల హితమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు ప్రారంభించారని అన్నారు. రాష్ట్రంలోని పేదల కోసం రూ.2 కిలో బియ్యం పథకాన్ని అమలు చేసిన తొలి సీఎం ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. తండ్రి ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించిన ఏకైక నాయకుడు తను అని అన్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు.