శాంసన్ పై ఎందుకింత కక్ష..?
నిలదీసిన ఎంపీ శశి థరూర్
తిరువనంతపురం – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత తిరువనంతపురం సిట్టింగ్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి తమ ప్రాంతానికి చెందిన కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ ఏడాది 2024లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ 17వ సీజన్ లో అత్యుత్తమమైన ఆట తీరును ప్రదర్శించడమే కాదు తన జట్టుకు సారథిగా సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నిరూపించుకున్నాడని కొనియాడారు శశి థరూర్. ఆయన గత కొంత కాలం నుంచీ సంజూకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. ట్విట్టర్ వేదికగా మరోసారి శాంసన్ వైరల్ గా మారారు.
ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇందుకు గాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక కసరత్తు చేస్తోంది. సంజూ శాంసన్ తో పాటు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ , కేఎల్ రాహుల్ పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా రాజ్యసభ సభ్యుడు, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత సంజూ శాంసన్ కెప్టెన్ కావాలంటూ సూచించాడు. అతడికి అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఈ విషయం గురించి భజ్జీని ప్రశంసలతో ముంచెత్తారు శశి థరూర్.