పాలసీ తయారీలో ప్రతినిధులను చేర్చాలి
ఐఎఫ్ఏటీ జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్
హైదరాబాద్ – ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (IFAT) యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుల సామాజిక భద్రత కోసం పాలసీ-మేకింగ్ (తయారీ)లో కార్మికుల ప్రతినిధులను చేర్చాలని డిమాండ్ చేశారు.
బుధవారం ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా కీలక ప్రకటన విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా వేలాది మంది గిగ్ , ప్లాట్‌ఫారమ్ కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (IFAT) యూనియన్ దేశ కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియాకు అధికారిక అభ్యర్థనను సమర్పించారు.
గిగ్ , ప్లాట్ ఫారమ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీపై ఇంటర్-మినిస్టీరియల్ వర్కింగ్ గ్రూప్‌లో చేర్చాలని IFAT కోరిందని తెలిపారు షేక్ సలావుద్దీన్.
రాష్ట్ర స్థాయి సంప్రదింపులు , ఇటీవలి “ప్రిజనర్స్ ఆన్ వీల్స్” నివేదికతో సహా విధాన చర్చలకు చురుకుగా సహకరిస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఈ సమూహంలో ఐఎఫ్ఏటీ యూనియన్ కు ప్రాతినిధ్యం కల్పించక పోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగిందని పేర్కొన్నారు .
భారతదేశం అంతటా గిగ్ , ప్లాట్‌ఫారమ్ వర్కర్ల మెరుగుదల కోసం విధాన రూపకల్పన ప్రక్రియలో కార్మికుల తరపున మాట్లాడేందుకు , తమ సమస్యలు విన్నవించేందుకు ప్రతినిధులు ఉండేలా చూడాలని కోరడం జరిగిందని తెలిపారు షేక్ సలావుద్దీన్.