సామాజిక భద్రత కల్పించడంపై సమావేశం
ఢిల్లీ – కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ ఆధారిత ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ వ్యవస్థాక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ సమావేశం అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం గిగ్ , ప్లాట్ ఫారమ్ వర్కర్స్ కోసం సామాజిక భద్రత కల్పించే విషయమై కీలక భేటీ జరిగింది.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రితో పాటు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంధ్లాజే, కార్మిక, ఉపాధికకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. కీలక సూచనలు చేశారు షేక్ సలావుద్దీన్. గిగ్ , ప్లాట్ ఫారమ్ కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాల కోసం ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇ-శ్రమ్ పోర్టల్ లో అగ్రిగేటర్ మాడ్యూల్ ను తయారు చేయాలని తెలిపారు. ప్లాట్ ఫారమ్ వర్కర్స్ అసోసియేషన్ ల నుండి సలహాలు , సూచనలు స్వీకరించాలని కోరారు షేక్ సలావుద్దీన్.
అంతే కాకుండా సామాజిక భద్రతా హక్కుల కోసం ప్రత్యేకంగా గుర్తింపు కార్డు (ఐడీ) జారీ చేయాలని, అన్ని ప్రయోజనాలు ఇంటర్ స్టేట్ పోర్టబిలిటితో అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కంపెనీలు విధిగా సెంట్రల్, స్టేట్ పోర్టల్ లో పని చేసే కార్మికులను నమోదు చేయాలని, డేటాలో పూర్తి పారద్శకత ఉండేలా చూడాలని , కార్మికులు, ప్రభుత్వానికి పూర్తి డేటా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు షేక్ సలావుద్దీన్. కార్మికులందరూ స్పష్టమైన మార్గదర్శకాలతో సంక్షేమ పథకాల పరిధిలోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
కార్మికుల హక్కులు, త్రిసభ్య సంక్షేమ బోర్డుల కోసం చట్టం రూపొందించాలని, కనీస హామీ ఆదాయం, యజమాని ఉద్యోగి గుర్తింపు కార్డు ఉండాలని, గిగ్, ప్లాట్ ఫారమ్ కార్మికుల కోసం ఫిర్యాదులను పరిష్కరించేందుకు వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, వృత్తి పరంగా ఆరోగ్యం, భద్రత కల్పించాలని, పని స్థలంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం, మహిళా కార్మికులకు భద్రత కల్పించాలని షేక్ సలావుద్దీన్ కేంద్ర మంత్రికి విన్నవించారు.