శిరోమణి అకాలీదళ్ నేతపై కాల్పులు
అధినేతకు తృటిలో తప్పిన ప్రమాదం
పంజాబ్ – శిరోమణి అకాలీదళ్ నాయకుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై బుధవారం స్వర్ణ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద ఓ వృద్ధుడు హత్యాయత్నం చేశాడు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ‘సేవాదర్’గా పని చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాదల్ సురక్షితంగా బయట పడ్డాడు.
ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు ఆ వ్యక్తిపై విరుచుకు పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియోను న్యూస్ ఏజెన్సీ పీటీఐ షేర్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో పవిత్ర దేవాలయం గోడకు బుల్లెట్ తగిలింది.
ఎస్‌ఎడి నాయకుడిపై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇండియా టుడే నివేదిక ప్రకారం, కాల్పులు జరిపిన వ్యక్తిని మాజీ , ఖలిస్తానీ ఉగ్రవాది నరైన్ చౌరాగా గుర్తించారు.
డిసెంబరు 2న శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ తనకు సూచించిన మతపరమైన తపస్సులో భాగంగా, బాదల్ అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ గేటు దగ్గర కూర్చున్నాడు, ఈటెను పట్టుకుని మెడలో ఫలకాన్ని ధరించాడు. ఈరోజు ఆయన తపస్సుకు రెండో రోజు.
2007 నుండి 2017 వరకు పంజాబ్‌లోని శిరోమణి అకాలీ దళ్ (SAD) , దాని ప్రభుత్వం చేసిన “తప్పులను” పేర్కొంటూ అకల్ తఖ్త్ ఈ శిక్షలను విధించింది.