ఏడుకొండలుకు అభివందనం
ఎక్సైజ్ ఎస్ఐ కి ఘనంగా వీడ్కోలు
నాగర్ కర్నూల్ జిల్లా – ఒకప్పుడు డ్రాపవుట్. కానీ నేడు ఆయన ఎక్సైజ్ శాఖలో ఎస్ఐగా పని చేస్తున్నా తను మాత్రం మూలాలు మరిచి పోలేదు. అతనే ఏడుకొండలు. తను చదువు కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో వాటిని పేద పిల్లలు పడ కూడదనే ఉద్దేశంతో ఏకంగా సంస్థను స్థాపించాడు.
తన స్వంత ఖర్చులతో వారికి శిక్షణ ఇప్పించాడు. తను హైదరాబాద్ కు బదిలీ కావడంతో వేలాది మంది విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. అంతే కాదు విద్యార్థినులు అయితే కంట తడి పెట్టారు. మరికొందరు కాళ్లకు దండం పెట్టారు.
కట్టె ఏడుకొండలుది నల్లగొండ జిల్లా. తొమ్మిది ఏళ్ల కిందట ది మిషన్ పేరుతో స్వచ్చంధ సంస్థను స్థాపించాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు పాఠాలు చెప్పే పనికి శ్రీకారం చుట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10 వేల మందికి పైగా ఆయన ద్వారా లబ్ది పొందారు. ప్రభుత్వ శాఖలలో ఉన్నత మైన ఉద్యోగాలు పొందారు.
ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూత ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా అడుగులు వేశారు ఏడుకొండలు. ఆన్ లైన్ , ఆఫ్ లైన్ కోచింగ్ ప్రోగ్రామ్స్ వల్ల వేలాది మందికి ఉపయోగం జరుగుతోందని పేర్కొన్నారు. గ్రామీణ తెలంగాణ విద్యార్థులకు ఆయన ఆత్మ బంధువు అయ్యాడు.