సిల్క్ స్మిత చెరగని ముద్ర
ఘనంగా ప్రముఖుల నివాళి
హైదరాబాద్ – సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న అరుదైన నటి సిల్క్ స్మిత. ప్రతిభా పాటవాలు ఉన్నప్పటికీ తను వ్యాంప్ పాత్రలకే పరిమితమై పోయింది. చివరకు మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె చని పోయి సరిగ్గా 28 ఏళ్లవుతోంది. సెప్టెంబర్ 23న ఈ లోకాన్ని వీడింది విలక్షణ నటి.
సిల్క్ స్మిత పూర్తి పేరు విజయ లక్ష్మి. సినిమాలలోకి వచ్చాక సిల్క్ స్మితగా పేరు మారింది. డిసెంబర్ 2, 1960లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో పుట్టింది. కేవలం 35 ఏళ్ల వయసులోనే కాలం చేసింది. దక్షిణాదిన కొంత కాలం తన పాత్రలో ఏలింది.
సిల్క్ స్మిత తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో 200లకు పైగా సినిమాలలో నటించింది. ఈమె ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేసింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆమె. 4వ తరగతి వరకే చదువుకుంది. సినీ నటి కావాలన్న కాంక్షతో మద్రాస్ లో ఉన్న తన అత్త ఇంటికి చేరుకుంది.
అనుకోకుండా తమిళంలో వండి చక్రంలో నటించింది. 1979లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె పాత్ర పేరు సిల్క్. ఈ చిత్రం భారీ జనాదరణ చూరగొంది. దీంతో తన పేరును సిల్క్ స్మితగా మార్చుకుంది. ప్రముఖ నటిగా, డ్యాన్సర్ గా పేరు పొందింది.
ప్రత్యేక, శృంగార గీతాలకు పెట్టింది పేరు సిల్క్ స్మిత. ఆమెను సాఫ్ట్ పోర్న్ నటిగా కూడా పేర్కొన్నా ఎక్కడా తను బాధ పడలేదు. లయనం సెక్స్ చిత్రంగా పేరు పొందినా సిల్క్ స్మిత సీతాకోక చిలుక, వసంత కోకిల చిత్రాలలో అద్భుతమైన పాత్రలలో నటించి మెప్పించింది. చివరి దాకా పెళ్లి చేసుకోలేదు. మద్యానికి బానిసైంది. చివరకు సూసైడ్ చేసుకుంది. ఒక గొప్ప నటిని కోల్పోయింది సినీ పరిశ్రమ.