ఘణంగా శ్రీ కపిలేశ్వర స్వామి ఉత్సవాలు
తిరుపతి – తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కపిలేశ్వర స్వామి వారు కామాక్షి అమ్మ వారి సమేతంగా సోమ స్కంద మూర్తిగా సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూస్తోంది.
మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు. మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్రమృగాల భయం ఉండదు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.