DEVOTIONAL

సింహ వాహనంపై శ్రీ ప‌ద్మావ‌తి ద‌ర్శ‌నం

Share it with your family & friends

యోగ నరసింహుడు అలంకారంలో అమ్మ వారు

తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు క‌నీవిని ఎరుగ‌ని రీతిలో కొన‌సాగుతున్నాయి. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మ‌రో వైపు తుఫాను ప్ర‌భావంతో భారీ వ‌ర్షాలు కురుస్తున్నా భ‌క్తులు కంటిన్యూగా వ‌స్తూనే ఉన్నారు.

ఇక ఉత్స‌వాల‌లో బాగంగా సింహ వాహనంపై యోగ నరసింహుడు అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మ వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. తుఫాన్ నేపథ్యంలో వాహన మండపంలో భక్తులు అమ్మ వారిని సేవించుకున్నారు.

సింహం పరాక్రమానికి, శీఘ్ర గమనానికి, ప్రతీక. అమ్మ వారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తారు. శ్రీ పద్మావతి అమ్మ వారు ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తారు.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి, ఈవో శ్యామల రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద‌రాజ‌న్‌, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.