స్కిల్ యూనివర్శిటీతో అవగాహన
సింగపూర్ – సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయన దావోస్ పర్యటనకు వెళ్లే ముందు సింగపూర్ కు చేరుకున్నారు. అక్కడ యూనివర్శిటీల పనితీరును పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు.
ఈ సందర్బంగా సింగపూర్ లోని ప్రతిష్టాత్మకమైన సంస్థగా పేరు పొందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ కాలేజ్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీలో భాగం కానున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందంపై సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) , యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సంతకాలు చేశాయి. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్శిటీని నెలకొల్పుతోందని , ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు, కంపెనీలకు స్వర్గ ధామంగా హైదరాబాద్ ఉందన్నారు సీఎం.