జానీ మాస్టర్ పై చిన్మయి శ్రీపాద కామెంట్స్
ఇలాంటి వాళ్లను వదలొద్దన్న సింగర్
తమిళనాడు – తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి స్పందించారు. మంగళవారం చిన్మయి ట్విట్టర్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సినీ పరిశ్రమలో ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయని, కానీ కొందరు బయటకు చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు చిన్మయి శ్రీపాద. ఆమె ప్రముఖ సినీ గేయ రచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేశారు. చివరకు తనకు వచ్చిన అవార్డులను సైతం వదులుకునేలా చేశారు. ఇప్పటికీ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాటం చేస్తూ వస్తున్నారు చిన్మయి శ్రీపాద.
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో చోటు చేసుకున్న జానీ మాస్టర్ ఘటనపై స్పందించారు. సాటి కొరియో గ్రాఫర్ ను లైంగిక కోర్కెలు తీర్చమంటూ వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. సభ్య సమాజం ఏమీ అనుకోదని, తమకు ఎదురే లేదన్న ధ్యాస, బలుపుతో జానీ మాస్టర్ భావించారని, అందుకే తను ఇలాంటి వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు.
మొత్తంగా బాధితురాలు ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు చిన్మయి శ్రీపాద. ప్రతి ఒక్కరు బాధితురాలికి అండగా నిలవాలని, మద్దతు తెలుపాలని పిలుపునిచ్చారు సింగర్.