సాక్షి రంగన్న మృతిపై అనుమానాలున్నాయి
కడప జిల్లా – దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు కడప జిల్లా ఎస్పీ జి. అశోక్ కుమార్. కీలకమైన సాక్షి వాచ్ మెన్ రంగన్న అనుమానాస్పద మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. వివేకా కేసులో కీలక సాక్షులంతా అనుమానాస్పద రీతిలో మృతి చెందారని అన్నారు. కటికరెడ్డి శ్రీనివాస రెడ్డి, కల్లూరి గంగాధర రెడ్డి, డ్రైవర్ నారాయణ, డాక్టర్ Y.S అభిషేక్ రెడ్డి ఇప్పుడు రంగన్న ఇలా ప్రతి ఒక్కరు చిరునామా లేకుండా చావులకు లోనైనట్లు తెలిపారు.
రంగన్న భార్య సుశీలమ్మ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. శుక్రవారం అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు వాచ్ మెన్ రంగన్న మృతిపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా కేసును దర్యాప్తు చేయడానికి సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం) ఏర్పాటు చేశామన్నారు. అత్యంత అనుమానాస్పద మృతిగా అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు ఎస్పీ. సైంటిఫిక్ యాంగిల్ లో కూడా కేసు దర్యాప్తు చేస్తామన్నారు. వివేకా హత్య కేసులో ఉన్న ముద్దాయిల ప్రమేయం ఏమన్నా ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతామన్నారు.