అన్ని రంగాలలో మహిళలు ముందంజ
విద్యా రంగంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి
హైదరాబాద్ – సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఉమెన్స్ డేను చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్మితా సబర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
గతంలో చదువు కోవడానికి లేదా పనులు చేసుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఉండేవని కానీ రాను రాను పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ఇవాళ మహిళలు పని చేయని రంగం అంటూ ఏదీ లేదన్నారు. నేల నుంచి నింగి దాకా అన్నింట్లోనూ మనమే కీలకమైన పాత్ర పోషిస్తున్నామని చెప్పారు.
యువతులు, బాలికలు, మహిళలు ప్రధానంగా విద్యా రంగంపై ఫోకస్ పెట్టాలని సూచించారు స్మితా సబర్వాల్. చదువు ఒక్కటే మనల్ని గొప్ప వ్యక్తులుగా తయారయ్యేలా చేస్తుందని చెప్పారు. అదే మనల్ని ఇంత దాకా తీసుకు వచ్చేలా చేసిందని గుర్తు చేశారు.
టెక్నాలజీ రంగం అనూహ్యంగా దూసుకు వెళుతోందని, దానిని కూడా గుర్తించి అవకాశాలు పొందేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.