స్మితా సబర్వాల్ షాకింగ్ కామెంట్స్
కొండా సురేఖ కామెంట్స్ పై ఫైర్
హైదరాబాద్ – తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకుండా ఉండేందుకు కేటీఆర్ వద్దకు ఒక్క రాత్రి సమంత రుత్ ప్రభు వెళ్లాలని అక్కినేని నాగార్జున , అమల ఫ్యామిలీ ఒత్తిడి చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆమె చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
దీనిని తీవ్రంగా ఖండించారు అక్కినేని నాగార్జున, అమలతో పాటు తనయుడు నాగ చైతన్య. ఇది తమ వ్యక్తిగత వ్యవహారమని, దీనిపై మాట్లాడే హక్కు మంత్రికి లేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి సమంత కూడా స్పందించింది.
ఇదిలా ఉండగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తనను విస్తు పోయేలా చేశాయని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ స్పందించారు. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
సమంత రుత్ ప్రభుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను బాధకు గురి చేసిందని పేర్కొన్నారు. తాను కూడా ఇలాంటి వ్యక్తిగతంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. మహిళలను, కుటుంబాలను, సామాజిక నిబంధనలను గౌరవించాలని సూచించారు స్మితా సబర్వాల్. మంత్రి ఇలా మాట్లాడతారని తాను అనుకోలేదని పేర్కొన్నారు.