NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ వ‌ద్ద ఉన్న ఆస్తుల‌న్నీ ప్ర‌జ‌ల‌వే

Share it with your family & friends

సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి కామెంట్స్

అమ‌రావ‌తి – మాజీ మంత్రి, ప్ర‌స్తుత స‌ర్వేప‌ల్లి శాస‌న సభ్యుడు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాజీ సీఎం , వైసీపీ బాస్ జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ రెడ్డి సంపాదించిన ఆస్తుల‌న్నీ ప్ర‌జ‌ల‌కు చెందిన‌వేన‌ని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నాడు. ఆయ‌న‌కు బంధాలు, బంధుత్వాలు అనేవి ఎలా ఉంటాయో కూడా తెలియ‌ద‌న్నారు. స్వంత త‌ల్లి, చెల్లికి ఆస్తుల్లో వాటాలు లేవంటూ ప్ర‌కటించ‌డం దారుణ‌మ‌న్నారు.

జ‌గ‌న్ రెడ్డిని మాజీ సీఎం అని పిల‌వ‌డానికి కూడా అర్హుడు కాద‌న్నారు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి. గురువారం మంగ‌ళ‌గిరి టీడీపీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ రెడ్డిది అత్యంత క్రూర‌మైన మ‌న‌స్త‌త్వం అని అన్నారు. ఓట్ల కోసం త‌ల్లి, చెల్లి అంటాడ‌ని, అవ‌స‌రం తీరాక వారిని గెంటి వేస్తాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాజ‌కీయాల‌కు, ఆస్తుల‌కు సంబంధం లేద‌ని పేర్కొన్నారు.

అసలు జగన్ వద్ద ఉన్న ఆస్తి అంతా ప్రజల ఆస్తి. సరస్వతి పవర్ కంపెనీకి వైఎస్ 2009 లో 600 హెక్టార్లకి పైగా క్వారీలని కట్టబెట్టాడని ఆరోపించారు. సరస్వతి పవర్ అనే కంపెనీని పెట్టాలని బోర్డు రిజల్యూషన్ రాక ముందే, వైఎస్ ప్రభుత్వం భూ కేటాయింపులు చేసిందని న్నారు.

2015 వ సంవత్సరం వరకు కూడా భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ పనులని ప్రారంభించ లేద‌ని పేర్కొన్నారు సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి. చట్టప్రకారం పరిశ్రమకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే రెండేళ్లలో పని మొదలు పెట్టాల్సి ఉంటుంద‌న్నారు.

రాజశేఖర్ రెడ్డి హయాంలో భూమి కేటాయించి 6 సంవత్సరాలు గడచినా పరిశ్రమ ఏర్పాటు చేయ లేద‌ని అన్నారు. కానీ జగన్ తాను సిఎంగా ఉండగా ఈ భూముల మీద లీజుని 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లకి పెంచుకున్నాడని ఆరోపించారు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి. తండ్రి రాజశేఖర్ రెడ్డినే కేసులో ఇరికించిన ఘనుడు జగన్ అని ధ్వ‌జ‌మెత్తారు.

జగన్ నిర్వాకం వల్లే రాజశేఖర్ రెడ్డి సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయి అయ్యాడని వాపోయారు. జగన్ క్రూర మనస్తత్వానికి ఇవి ఉదాహరణలు అని అన్నారు.