ఓటేయండి హస్తాన్ని ఆదరించండి
పిలుపునిచ్చిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ – దేశంలో ప్రస్తుతం నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్బంగా ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా జాతిని ఉద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు.
గతంలో ఎన్నడూ లేనంతగా దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా దేశానికి ఆయువు పట్టుగా భావించే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం రెండూ ప్రమాదంలో ఉన్నాయని వాపోయారు. ఈ దేశం పట్ల తమకే హక్కు ఉందని పదే పదే చెప్పే వాళ్లే దేశ అభివృద్దికి ఆటంకంగా తయారయ్యారని పేర్కొన్నారు.
ఓటు అత్యంత కీలకమైనదని, ఈ విపత్కర సమయంలో దేశ భవిష్యత్తు కోసం , ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటు వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు సోనియా గాంధీ. ఇవాళ దేశం అన్ని రకాలుగా నష్ట పోయిందని, ప్రధానంగా పేదలు, మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని సోనియా గాంధీ కోరారు.