సోనియమ్మ జై తెలంగాణ
రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు
న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ గొప్ప రాష్ట్ర ఆవిర్భావం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అసంఖ్యాక అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా వీడియో సందేశం వినిపించారు.
తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను కాంగ్రెస్ పార్టీ నెర వేరుస్తుందని 2004లో కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చానని గుర్తు చేశారు సోనియా గాంధీ. ఈ ప్రకటన తర్వాత సొంత పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వచ్చినా తాను ప్రజల వైపు మొగ్గానని చెప్పారు. చాలా మంది తమ పార్టీని వీడారని, కానీ మీ ఓపిక, దృఢ సంకల్పం నాకు తెలంగాణ కలను సాకారం చేసుకునే శక్తిని, ధైర్యాన్ని, స్ఫూర్తినిచ్చాయని ప్రశంసించారు.
గత పదేళ్లలో తెలంగాణ ప్రజలు నాకు ఎంతో గౌరవం, ప్రేమను ఇచ్చారు. సుభిక్షమైన, అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించే బాధ్యతను మీరంతా తమ పార్టీకి అప్పగించారని, ఆ కలలన్నింటినీ నెరవేర్చడం నా కర్తవ్యంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు సోనియా గాంధీ.
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూచ తప్పకుండా అమలు చేస్తుందని తాను హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు.