ఉదర సంబంధ సమస్యతో ఇబ్బంది
ఢిల్లీ – సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించారు. ఉదర సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సోనియా వయసు 78 ఏళ్లు. ఆస్పత్రి నిర్వహణ బోర్డు చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ ఆధ్వర్యంలో చికిత్సలు కొనసాగుతున్నాయి. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్బంగా వెల్లడించారు. సోనియా గాంధీ ప్రస్తుతం గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ సమిరాన్ సంరక్షణలో ఉన్నారు.
ఇదిలా ఉండగా గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సోనియా గాంధీ. కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కాలేదు. అంతకు ముందు తన తనయుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
సోనియా గాంధీ చివరిసారిగా ఈనెల 13న రాజ్యసభలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై సీరియస్ కామెంట్స్ చేశారు. సోనియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గత నెల జనవరి 15న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.