NEWSTELANGANA

ఖ‌మ్మం సీటుకు పెరిగిన డిమాండ్

Share it with your family & friends

సోనియా..నందిని..రేణుకా చౌద‌రి

హైద‌రాబాద్ – త్వ‌ర‌లో రాష్ట్రంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 17 లోక్ స‌భ స్థానాల‌కు గాను భారీ ఎత్తున పోటీ నెల‌కొంది. ఇప్ప‌టికే అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీకి టికెట్లకు సంబంధించి అభ్య‌ర్థుల ఎంపిక త‌ల‌కు మించిన భారంగా మారింది. ఇప్ప‌టికే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి 300కు పైగా ద‌ర‌ఖాస్తులు అందాయి. ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.

ఇదంతా ప‌క్క‌న పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు సీపీపీ చైర్ ప‌ర్స‌న్ , ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ. టీపీసీసీ ఏక‌గ్రీవంగా తీర్మానం చేసింది. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయాల‌ని. ఈ మేర‌కు హైక‌మాండ్ సైతం ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియ‌ర్ నాయ‌కులు సోనియా గాంధీని ఖ‌మ్మం జిల్లా నుంచి పోటీ చేయించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లు టాక్. ఇప్ప‌టికే ఇదే ఎంపీ స్థానానికి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స‌తీమ‌ణి నందినితో పాటు మాజీ ఎంపీ రేణుకా చౌద‌రి కూడా బ‌రిలో ఉంటార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ సోనియా ఓకే అయితే ఇక వీరికి దారులు మూసుకున్న‌ట్టే.