సీఎం పర్యటనలో అరెస్ట్ లపై స్పందన
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నిన్న శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆ ప్రాంతానికి చెందిన సీపీఎం నేతనలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని పరిశీలించానని తెలిపారు నారా లోకేష్.
పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల తాను చింతిస్తున్నట్లు పేర్కొన్నారు ఏపీ మంత్రి. ఈ సందర్బంగా జరిగిన అసౌకర్యానికి మన్నించాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం ఇలాంటి వాటిని ప్రోత్సహించదని స్పష్టం చేశారు నారా లోకేష్.
గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు తమ సర్కార్ ఒప్పుకునే ప్రసక్తి లేదని తెలిపారు. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారక పోవడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు .
ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వమని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతామని స్పష్టం చేశారు నారా లోకేష్.