సమ ఉజ్జీల సమరానికి వేళాయె
తమిళనాడు – ఐపీఎల్ 2024 ఆఖరి అంకానికి చేరుకుంది. ఫైనల్ లో ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ చేరుకుంది. ఇక ఆ జట్టుతో ఎవరు తల పడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ఆట తీరుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మట్టి కరిపించింది.
తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో బరిలోకి దిగబోతోంది. శుక్రవారం సాయంత్రం తమిళనాడు రాజధాని చెన్నై లోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్లు తమ బలా బలాలను ప్రదర్శించేందుకు సిద్దమయ్యాయి. కోట్లాది మంది ఐపీఎల్ అభిమానులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
ఇరు జట్లు బ్యాటింగ్ లో, బౌలింగ్ లో సరి సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ ఆద్యంతమూ ఆకట్టుకునేలా ఉంటుందనడంలో సందేహం లేదు. హైదరాబాద్ , రాజస్థాన్ జట్ల మధ్య ఏ జట్టు గెలిస్తే ఆ టీమ్ ఫైనల్ కు వెళుతుంది. ప్రస్తుతం క్వాలిఫయర్ -2 మ్యాచ్ కు వేదిక కానుంది చెపాక్ స్టేడియం.
ఇక జట్ల పరంగా చూస్తే రాజస్థాన్ జట్టులో సంజూ శాంసన్ , జైశ్వాల్ , పరాగ్ , జురైల్ , హిట్ మెయిర్ , పావెల్ , అశ్విన్ , చాహల్ , అవేశ్ , బౌల్ట్ ఆడతారు. ఇక హైద్రాబాద్ జట్టులో రాహుల్, నితీశ్, అభిషేక్, హెడ్ , క్లాసెన్ , సమద్, షాబాజ్ , కమిన్స్ , భువీ, వియస్కాంత్, నటరాజన్ ఉన్నారు.