DEVOTIONAL

సంకీర్త‌న‌లు పుల‌కించిన స‌ప్త‌గిరులు

Share it with your family & friends

ఘ‌నంగా అన్న‌మ‌య్య వ‌ర్థంతి

తిరుమల – పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతిని తిరుమ‌ల లోని నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఊంజల్‌సేవలో సప్తగిరి సంకీర్తనల గోష్టి గానంతో సప్తగిరిలు పులకించాయి.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామిజీ అనుగ్రహ భాషణం చేశారు. అన్నమయ్యకు, వారి ఆచార్య పీఠమైన అహోబిల మఠానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారు.

అన్నమయ్య విద్యాభ్యాసం, వేద శాస్త్రాల అధ్యయనం ఇక్కడే సాగిందని చెప్పారు. అహోబిలం శ్రీ నరసింహ స్వామి వారి అనుగ్రహంతో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు దీక్ష పొంది మంత్రోపదేశం పొందారని వివరించారు.

ఈ మంత్రో పదేశంలోని 32 బీజాక్షరాలతో అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించారన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం శ్రీవారి అనుగ్రహం అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా టీటీడీ అన్నమయ్య జయంతి, వర్ధంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అన్నమయ్య సంకీర్తనలను జనంలోకి తీసుకువెళ్లడానికి మరింత మంది యువ కళాకారులు కృషి చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వామీజీకి గరుడ పురాణం 1, 2 పుస్తక ప్రసాదాన్ని ఈవో ఎవి.ధర్మారెడ్డి అందించారు.

అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీషణ శ‌ర్మ మాట్లాడుతూ సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పద కవితా పితామహుడు అన్నమాచార్య అన్నారు. 521వ వర్ధంతి మహోత్సవాలను తిరుమలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.