16 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. వచ్చే మే నెల 16 నుంచి తిరుపతి లోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన గోవింద రాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు ఉత్సవాల విశేషాలను వివరించింది. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్నాయని, మే 24 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని టీటీడీ తెలిపింది.
మే 15న సాయంత్రం అంకురార్పణతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని పేర్కొంది.
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవల నిర్వహణ ఉంటుందని వెల్లడించింది.
16న ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనం, 17న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామి వారు దర్శనమిస్తారని టీటీడీ తెలిపింది. 18న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 19న ఉదయం కల్పవృక్ష వాహనం , రాత్రి సర్వభూపాల వాహనం, 20న ఉదయం మోహినీ అవతారం , రాత్రి గరుడ వాహనంపై స్వామి వారు ఊరేగుతారని టీటీడీ స్పష్టం చేసింది.
21న ఉదయం హనుమంత వాహనం , రాత్రి గజ వాహనం , 22 ఉదయం సూర్యప్రభ వాహనం , రాత్రి చంద్రప్రభ వాహనం, 23న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం , 24న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపింది టీటీడీ.