DEVOTIONAL

గోవిందరాజ స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

Share it with your family & friends

ఘ‌నంగా ప్రారంభ‌మైన ఉత్స‌వాలు

తిరుప‌తి – ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రమైన తిరుప‌తి లోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8.15 నుండి 8.40 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజ పటాన్ని ధ్వజ స్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది.

అంతకు ముందు శ్రీ గోవింద రాజస్వామి వారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి.

అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ట , రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశం.

   అనంత‌రం ఉద‌యం 10.30 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ స్వామి ఉత్స‌వ‌ర్ల‌కు వైభ‌వంగా స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.

   సాయంత్రం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్ సేవ‌, రాత్రి 7 గంట‌ల‌కు పెద్దశేష వాహ‌న సేవ  చేప‌ట్టారు.