పుష్ప యాగం అంగరంగ వైభవం
ఏర్పాట్లు చేసిన టీటీడీ
తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని తిరుపతిలో కొలువు తీరిన , కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లిన శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయంలో శుక్రవారం పుష్ప యాగం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా సేనాధిపతి ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఈ పుష్పయాగ మహోత్సవానికి .
పుష్ప యాగ కార్యక్రమంలో భాగంగా శ్రీ విష్వక్సేనుల వారు ఆలయ మాడ వీధుల్లో విహరించారు. ఆ తరువాత అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు.
ఇవాళ ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం 6 గంటలకు వీధి ఉత్సవం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ రాధాకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.