శాస్త్రోక్తంగా అంకురార్పణ చేసిన పూజారులు
తిరుపతి – శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు టీటీడీ. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి అందంగా రంగవల్లులు తీర్చి దిద్దారు. భక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు టిటిడి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. వాహనసేవల సమయంలో భక్తులకు అన్న ప్రసాదాలు, మజ్జిగ, పాలు, తాగునీరు అందించనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు భక్తులకు అందుబాటులో ఉంచారు. భక్తులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరం ఏర్పాటుచేశారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు అలంకరణకు సంబంధించి మొత్తం 3 టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు. ఇందులో సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీజాతుల పుష్పాలు కూడా ఉన్నాయి. వాహనసేవల్లో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించనున్నారు. దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.