ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష
విజయవాడ – ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి ఆలయ అభివృద్దికి సరికొత్తగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు ఎమ్మెల్యే సుజనా చౌదరి. ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకునేందుకు వస్తుంటారని, ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ది కోసం చర్యలు తీసుకుందన్నారు. ఈ మేరకు బడ్జెట్ లో నిధులు కేటాయించామన్నారు. ఇంద్రకీలాద్రి అమ్మ వారి ఆలయానికి సంబంధించి సమీక్ష చేపట్టారు ఎమ్మెల్యే సుజనా చౌదరి. ప్రభుత్వం మెరుగైన రీతిలో పర్యాటక రంగానికి సంబంధించి పాలసీని తయారు చేసిందన్నారు. ఇదే సమయంలో దుర్గ గుడికి సంబంధించి పాలసీని రూపొందించాలన్నారు.
తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుర్గ గుడి ఇంజనీరింగ్ అధికారులు, ఆర్కిటెక్ట్ లు, టెక్నికల్ టీం తో ఎమ్మెల్యే కీలక సూచనలు చేశారు. భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి , భవిష్యత్తులో ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు రాకుండా ఉండటానికి సరికొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ఎన్ని నిధులు అవసరమైనా మంజూరు చేస్తామని ప్రకటించారు సుజనా చౌదరి.