DEVOTIONAL

ఘ‌నంగా కోదండ రాముడి పేట ఉత్స‌వం

Share it with your family & friends

భారీ ఎత్తున పాల్గొన్న భ‌క్త బాంధ‌వులు

తిరుప‌తి – తిరుప‌తిలో కొలువు తీరిన శ్రీ కోదండరామ స్వామి వారి పేట ఉత్సవం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి మరుసటి రోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామ స్వామి వారి ఉత్సవ మూర్తులను తిరుపతి సమీపంలోని కూపు చంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీగా వ‌స్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు బయలు దేరింది. ఉదయం 9.30 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది.

ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళు, పసుపు, చందనంతో స్వామి, అమ్మ వారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం ఊంజల్‌సేవ చేపట్టారు. ఆ తరువాత గ్రామోత్స‌వం నిర్వ‌హించి ఆలయానికి చేరుకున్నారు. ఉదయం, సాయంత్రం జరిగిన స్వామి వారి ఊరేగింపులో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీకి చెందిన‌ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ ర‌మేష్ పాల్గొన్నారు.