వైభవోపేతం రథోత్సవం
కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి – తిరుపతి లోని ప్రసిద్ద దేవాలయమైన శ్రీ కోదండ రామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇవాళ ఎనిమిదో రోజు కావడం విశేషం. శుక్రవారం కోదండ రామ స్వామి వారి రథోత్సవం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జరిగింది.
ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండ రాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. రథం నాలుగు మాడ వీధుల్లో ఊరేగి యథా స్థానానికి చేరిన తరువాత ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వ జ్ఞానమిదే.
మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకులు తిరుమంజనం, ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అశ్వవాహన సేవ వేడుకగా చేపట్టారు.
వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డెప్యూటీ ఈవోలు గోవింద రాజన్, నాగరత్న, ఏఈవో పార్థసారధి, సూపరింటెండెంట్ సోమశేఖర్, ఇంజనీరింగ్, పోలీస్, విజిలెన్స్ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.