ముగిసిన శ్రీ పద్మావతి పవిత్రోత్సవాలు
మహా పూర్ణాహుతితో ముగిసిన వైనం
తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో తిరుపతి లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి పవిత్రోత్సవాలు.
ఇవాల్టితో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 11.50 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, శాంతి హోమం, కుంభ ప్రోక్షణ, నివేదన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె. శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు.
అంతకు ముందు మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మ వారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఆ తర్వాత చక్రత్తాళ్వార్‌ను పల్లకీపై ఊరేగింపుగా పద్మపుష్కరిణి వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి వారు, శ్రీ సుందర రాజ స్వామి వారు, శ్రీ పద్మావతి అమ్మ వారు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.