11వ తేదీ వరకు వాల్మీకిపురంలో జరగనున్నాయి
తిరుపతి – వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 3 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ పాలక మండలి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఈవో జె. శ్యామల రావు ఆదేశించారు.
వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 3వ తేదీన ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు) రాత్రి గజ వాహనం జరుగుతుంది. 4వ తేదీన ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి హనుమంత వాహనంపై స్వామి వారు ఊరేగుతారు. 5వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సింహ వాహనం, 6వ తేదీన ఉదయం సర్వ భూపాల వాహనం, రాత్రి పెద్ద శేష వాహనం, 7వ తేదీన ఉదయం సూర్య ప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, మోహనీ అవతారంలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారు.
ఏప్రిల్ 8వ తేదీన ఉదయం తిరుచ్చి ఉత్సవం, రాత్రి కళ్యాణోత్సవం రాత్రి 8 నుండి 10 గంటల వరకు,
గరుడ వాహనం రాత్రి 11 గంటలకు జరుగుతుంది. 9వ తేదీన ఉదయం – రథోత్సవం (ఉదయం 9.30 గంటలకు) , రాత్రి – ధూళి ఉత్సవం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుంది. 10వ తేదీన ఉదయం తిరుచ్చి ఉత్సవం, రాత్రి అశ్వవాహనం, పార్వేట ఉత్సవం, 11వ తేదీన ఉదయం – వసంతోత్సవం (ఉదయం 8 గంటలకు), చక్రస్నానం ( మధ్యాహ్నం 12.05 గంటలకు) , రాత్రి హంస వాహనం ( రాత్రి 8 నుండి 10 గంటల వరకు), ధ్వజావరోహణం (రాత్రి 10 గంటలకు) జరుగుతుంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 8న రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.