DEVOTIONAL

హ‌నుమంత వాహ‌నంపై కోదండ రాముడు

Share it with your family & friends

భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చిన మ‌ల‌య‌ప్ప స్వామి

తిరుమ‌ల – శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు.

గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహక రూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది.

సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప స్వామి వారు భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గ‌జ వాహనంపై స్వామి వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు.

వాహ‌న సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, ఈవో జె శ్యామలరావు, అద‌న‌పు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌత‌మి, వీర‌బ్ర‌హ్మం, టీటీడీ అధికారులు, ఇత‌ర ప్ర‌ముఖులు పాల్గొన్నారు.