శేషాచల అడవుల్లో వెలసిన స్వామి
తిరుమల – తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్య తీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకగా జరిగింది. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీరామకృష్ణ మహర్షి తపో బలంతో ఈ పుణ్య తీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.
శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 11 గంటలకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్ర మూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు.
రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాప వినాశనం డ్యామ్ వద్ద పొంగలి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. తీర్థం వద్ద టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు మందులు పంపిణీ చేశారు.
టీటీడీ ఇంజినీరింగ్, అటవీ విభాగాల ఆధ్వర్యంలో మార్గమధ్యంలో పలుచోట్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నడక మార్గాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.