DEVOTIONAL

అమ్మ వారి సేవ పూర్వజన్మ సుకృతం

Share it with your family & friends

వాహ‌న‌సేవ‌లో శ్రీ రంగం శ్రీ‌వైష్ణ‌వులు

తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మ వారు పలు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సేవల్లో అమ్మ వారి వాహనాలను మోస్తున్నది తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన శ్రీవైష్ణవ సంప్రదాయపరులు.

శ్రీరంగంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు శ్రీవైష్ణవ సంప్రదాయపరులు గత 32 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్నారు. శ్రీ అమ్మ వారి వాహనం మోతాదుకు మించి బరువు ఉన్నా కేవలం భక్తి భావంతో ఎంతటి బరువున్నా అమ్మ వారి సేవలో తరిస్తున్నారు.

ఒక్కో వాహనానికి మర్రి ఊడలతో తయారు చేసిన 28 అడుగుల పొడువైన 4 తండ్లును, కొయ్యతో తయారు చేసిన రెండు అడ్డ పట్టీలు, గొడుగు పలకలు, ఇద్దరు అర్చకులు, గొడుగులు పెట్టేందుకు మరో ఇద్దరు ఉంటారు, వీటి అన్నింటినీ కలిపితే ఒక్కో వాహనం దాదాపు రెండున్నర టన్నుకు పైగా బరువు ఉంటుంది.

ఉదయం, రాత్రి వాహనసేల్లో ఒక్కో వాహన సేవలో దాదాపు మూడు గంటలు పాటు బరువును మోస్తూ వాహన బ్యారర్లు తమ భక్తి భావాన్ని చూపుతున్నారు. అంతే కాక మూడు గంటల పాటు నడుచుకుంటూ భుజం మీద మోస్తూ నాలుగు మాడా వీధుల్లో తిరగడం అంటే సాధారణ విషయం కాదు,

వాహన బ్యారర్ల తమ భుజాలు మీద మోయడం మూలంగా భుజంపై ఉబ్బి కాయ కాసినట్లు అనిపిస్తుంది. అయినా ఏ మాత్రం సంకోచించకుండా అమ్మవారి సేవలో తరిస్తున్నారు.

శ్రీ కాంతన్ నేతృత్వంలో 32 ఏళ్లుగా అమ్మవారి వాహనసేవ కైంకర్యంలో పాలు పంచుకుంటున్నారు. వీరు మొత్తం 52 మంది ఉన్నారు. వీరు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఐటి రంగంలోను, రైల్వే ఉద్యోగులు, బ్యాంక్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరితోపాటు విద్యార్థులు కూడా ఉన్నారు.

శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి వారి ఆలయంలోనూ వీరు ఇలాంటి సేవలు అందిస్తున్నారు. వీరు వాహనం మోసేటప్పుడు, వారి నడకలో నాలుగు రకాలైన విధానాలు పాటిస్తారు. తద్వారా వాహనంపై ఉన్న అమ్మవారు, వాహన సేవ వీక్షిస్తున్న భక్తులు తన్వయత్వం చెందుతారు.

తిరుచానూరు బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే వీరంతా తమ తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి వచ్చేస్తారు. వీరికి టిటిడి ఉచితంగా బస, భోజనం కల్పించి, వస్త్ర బహుమానం, ప్రయాణ ఖర్చులు చెల్లిస్తోంది.

వాహ‌న‌సేవ‌కులు మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీమహా విష్ణువు దేవేరి అయిన శ్రీ పద్మావతి అమ్మ వారిని తమ భుజస్కంధాలపై మోయడం పూర్వజన్మ సుకృతమన్నారు. అందరికీ ఈ అవకాశం రాదని, అమ్మవారి కృపతో తమ జీవితాలు సుఖసంతోషాలతో ఉన్నాయని తెలిపారు.