సింహ వాహనంపై ఊరేగిన స్వామి, అమ్మ వారు
తిరుపతి – ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రాత్రి 7 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగ శాస్త్రంలో సింహం బలానికి (వహనశక్తి), వేగానికి (శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహన సేవలో అంతరార్థం.
ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 11న ఘనంగా సీతా రాముల కళ్యాణోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకున్నారు. స్వామి, అమ్మ వార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సీఎం పర్యటన సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.