తరలి వచ్చిన భక్త బాంధవులు
తిరుపతి – తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమ స్కంద మూర్తి తిరుచ్చిపై కటాక్షించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పుర వీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది.
వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
మహాదేవుడైన కపిలేశ్వర స్వామిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచ్చి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరతాయని ఐతిహ్యం.
అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కంద మూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మ వారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బ రాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.