DEVOTIONAL

ఘ‌నంగా తిరుప‌తమ్మ క‌ళ్యాణం

Share it with your family & friends

ప‌తి భ‌క్తికి దైవ శ‌క్తికి ప్ర‌తీక అమ్మ

కృష్ణా జిల్లా – శ్రీ‌ల‌క్ష్మీ తిరుప‌త‌మ్మ క‌ళ్యాణం అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతోంది. కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలును గ‌తంలో పెద‌కంచి అని పిలిచే వారు. తిరుప‌త‌మ్మ పేరంటాలుగా ఈ క్షేత్రంలో పూజ‌లు అందుకుంటోంది. ప‌తి భ‌క్తికి దైవ శ‌క్తికి ప్ర‌తీక‌గా అమ్మ వారిని కొలుస్తారు.

పెనుగంచి ప్రోలులో ప్ర‌తి మాఘ పౌర్ణమికి శ్రీలక్ష్మీ తిరుపతమ్మ కల్యాణం వైభవంగా జరుగుతుంది. భూదేవి కోరికపై మానవ రూపంలో జన్మించిన త్రిశక్తి స్వరూపిణి తిరుపతమ్మ గృహిణిగా ఆదర్శ వంతమైన జీవితాన్ని కొనసాగించింది.

సతీ ధర్మానికి సరైన అర్థం చెప్పిన అమ్మ, గోపయ్యతో కలిసి పెనుగంచిప్రోలులో పూజలు అందుకుంటోంది. శుక్ర , ఆదివారాల్లో భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. మాలధారణతో మండలదీక్ష పూర్తి చేసి పెద్దసంఖ్యలో అమ్మ వారిని దర్శించుకుంటూ వుంటారు.

ప్రదక్షిణ మార్గంలో బయలు దేరిన భక్తులు ముందుగా వేప చెట్టును దర్శించుకుని ఆ తరువాతనే అమ్మ వారిని దర్శించు కోవడం సంప్రదాయంగా వ‌స్తోంది. ఉత్సవాల సమయంలో తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పసుపు కుంకుమలు అమ్మ వారికి పంపించటం ఆనవాయితి.

శ్రీ తిరుపతమ్మ విగ్రహం ప్రక్కన ఆమె భర్త శ్రీ గోపయ్య విగ్రహంతో పాటు వేరే మంటపాలలో శ్రీ అంకమ్మ, ఇతర దేవతల విగ్రహాలు కూడా ప్రతిష్ఠితమయ్యాయి. మాఘ పౌర్ణమి నుంచి ఐదురోజులు, ఫాల్గుణ మాసంలో నెల రోజులు పెనుగంచిప్రోలు ఉత్సవాలు జరుగుతాయి.