ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
నంద్యాల జిల్లా – పుణ్య క్షేత్రం శ్రీశైలం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. మహా శివరాత్రి సందర్బంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. శివ నామ స్మరణతో శ్రీశైలం దద్దరిల్లుతోంది. ఉత్సవాల సందర్బంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్లకు కాణికాపం దేవస్థానం తరపున ఈవో పెంచల కిషోర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
శ్రీశైల మహా క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జే శ్యామలరావు దంపతులు, టీటీడీ అధికారులు స్వామి అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు
సాయంత్రం పుష్పాలంకృత శోభితులైన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను మయూర వాహనంపై అధిరోహింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మ వార్ల గ్రామోత్సవం శ్రీగిరి వీధులలో అంగరంగ వైభవంగా సాగింది. శివదీక్ష శివ స్వాముల పంచాక్షరి నామ స్మరణతో మారు మ్రోగింది.