కళ కళ లాడుతున్న శ్రీశైలం జలాశయం
భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు
అమరావతి – ఏపీలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనంగా మారడంతో కుండ పోత కొనసాగుతోంది. ఎక్కడ చూసినా కాలువలు, చెరువులు, ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టులన్నీ నీళ్లతో కళ కళ లాడుతున్నాయి. భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. మత్స్య కారులు, రైతులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.
వరద నీటి ప్రవాహంతో విజయవాడ లోని ప్రకాశం బ్యారేజ్ నిండు కుండను తలపింప చేస్తోంది. మరో వైపు శ్రీశైలం ప్రాజెక్టుకు ఆల్మట్టి డ్యాం నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు కళ కళ లాడుతోంది.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపింప చేస్తోంది. ఇన్ ఫ్లో 99,894 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో ఏమీ లేదు. పూర్తి స్థాయి నీటి మట్టం ప్రాజెక్టుకు సంబంధించి 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 814.50 అడుగుల దాకా చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 37.0334 టీఎంసీలుగా ఉందని తెలిపారు డ్యాం అధికారులు.