శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద
నిండు కుండను తలపిస్తున్న ప్రాజెక్టు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ లో ఎగువ కురుస్తున్న వర్షాల తాకిడికి ప్రాజెక్టులన్నీ జల కళ సంతరించుకున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీశైలం ఆలయం పక్కనే ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతూ వస్తోంది.
దీంతో ప్రాజెక్టు నిండు కుండగా మారడంతో జలాశయం నుంచి 10 గేట్లు ఎత్తి వేశారు. దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,98,700 క్యూ సెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 3,75,300 క్యూ సెక్కులుగా ఉన్నాయని శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 203.4290 టీఎంసీలు గా నమోదైంది. భారీ ఎత్తున నీరు చేరుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు కేంద్రంగా కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని పేర్కొన్నారు నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారులు.