శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి
కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
కర్నూల్ జిల్లా – ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి నీరు ఉధృతంగా వస్తోంది. దీంతో కృష్ణా, గోదావరి నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాల ధాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలంగా మారి పోయింది. ఎక్కడ చూసినా నీళ్లే దర్శనం ఇస్తున్నాయి.
పెద్ద ఎత్తున కురుస్తున్న వానలతో రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు నిండు కుండలను తలపింప చేస్తున్నాయి. అన్నీ జల కళను సంతరించుకున్నాయి. ఓ వైపు వరద సహాయక చర్యలు కొనసాగుతున్నా ఇంకా నీళ్లు బెజవాడను తాకుతూనే ఉన్నాయి. ఎప్పుడు ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అవుతుందో తెలియక బిక్కు బిక్కుమంటున్నారు జనం.
మరో వైపు కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,57,179 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 68,235 క్యూసెక్కులుగా ఉందని శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
కాగా భారీ ఎత్తున నీరు చేరుకోవడంతో ముందు జాగ్రత్తగా నీటిని దిగవకు వదులుతున్నారు. మరో వైపు ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు వెళుతున్న భక్తులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.