వైభవోపేతం చక్రధారుడి చక్రస్నానం
ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవం
తిరుమల – శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
అంతకు ముందు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామి వారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవ రాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్య హవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీ ప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుష సూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు.
అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
తొమ్మిది రోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖశాంతులతో ఉండడానికి- చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక – యజ్ఞాంతంలో అవభృథస్నానం’ చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్ని సంపూర్ణ ఫలాలు చేకూరడం కోసం చేసే దీక్షాంత స్నానం అవభృథం.
చక్రస్నానం (అవభృథం)లో శ్రీవారి సుదర్శన చక్రానికి (చక్రత్తాళ్వార్‌కు) పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు శ్రీభూ సమేత మలయప్పస్వామికి ‘స్నపన తిరుమంజనం’ నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణి జలంలో ముంచి, స్నానం చేయించారు.
ఆ దివ్యాయుధ స్పర్శవల్ల పవిత్రమైన పుష్కరిణి జలంలో భక్త సమూహం కూడా అదే సమయంలో స్నానం చేశారు. ఇందువల్ల ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించిన వారికి, ఇందుకు సహకరించిన వారికి దర్శించిన వారికి ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు గౌతమి , శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీధర్, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.