ప్రాణదాన ట్రస్టుకు రూ. 50 లక్షలు విరాళం
బెంగళూరుకు చెందిన భక్తుడు బీఎంకే నగేష్
తిరుమల – కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలు కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ ఎత్తున విరాళాలు సమకూరుతున్నాయి. ఇప్పటికే లెక్కించలేనంత విరాళాలు హుండీ రూపంలో వస్తున్నాయి.
టీటీడీ ఆధ్వర్యంలో పలు సామాజిక, ఆధ్యాత్మిక, ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఉచితంగా భక్తులకు ,ఇతరులకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తోంది టీటీడీ. ఇందుకు సంబంధించి ప్రాణదాన ట్రస్టును ఏర్పాటు చేసింది.
టీటీడీ ఇచ్చిన పిలుపు మేరకు భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సమర్పించు కోవడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా బెంగళూరుకు చెందిన శ్రీవారి భక్తుడు బీఎంకే నగేష్ ఏకంగా టీటీడీ ఎస్వీ ప్రాణ దాన ట్రస్టుకు రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చారు.
శుక్రవారం టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి ఆయన చెక్కును అందజేశారు. ఇదిలా ఉండగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా భక్తుడు ఏఈవోకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రాణ దాన ట్రస్టుకు మానవతా దృక్ఫథంతో భారీ విరాళాన్ని అందించిన భక్తుడికి అభినందనలు తెలిపారు ఏఈవో.