మే 19వ తేదీ వరకు న్యూఢిల్లీ స్వామి వారి గుడిలో
తిరుమల – టీటీడీ కీలక ప్రకటన చేసింది. న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. మే 10న సాయంత్రం అంకురార్పణం జరుగనుందని పేర్కొంది. బ్రహ్మోత్సవాల ముందు మే 6వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. మే 11వ తేదీ ఉదయం 6 నుండి 8.07 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవల వివరాలను వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి. మే11న ఉదయం శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి పెద్ద శేష వాహనంపై స్వమి వారు భక్తులకు దర్శనం ఇస్తారు. 12న ఉదయం చిన్న శేష వాహనంపై, రాత్రి హంస వాహనంపై ఊరేగుతారు. 13న ఉదయం సింహ వాహనంపై, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై దర్శనం ఇస్తారు. 14న ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి సర్వ భూపాల వాహనంపై ఊరేగుతారు. 15న ఉదయం మోహినీ అవతారంలో, సాయంత్రం కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రాత్రి గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు.
మే 16వ తేదీన ఉదయం హనుమంత వాహనంపై, రాత్రి గజ వాహనంపై ఊరేగుతారు. 17న ఉదయం సూర్య ప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనం ఇస్తారు. 18న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనంపై , 19న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహనం నిర్వహిస్తారు.