DEVOTIONAL

ఆక‌ట్టుకున్న‌ సుగంధ ద్రవ్యాలు..ఎండుఫ‌లాలు

Share it with your family & friends

స్న‌ప‌నంలో ఆక‌ర్ష‌ణీయంగా మాల‌లు, కిరీటాలు

తిరుమ‌ల – శ్రీ‌వారి స్న‌ప‌న తిరుమంజ‌నంలో శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామి వారిని స్పృశించే అవ‌కాశం శ్రీవల్లి పుత్తూరు నుండి మొదటిసారిగా తెచ్చిన చిలకలతో చేసిన మాల‌లు, కిరీటాలకు దక్కింది. శనివారం ఆలయంలోని రంగ నాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్న‌ప‌న తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా జరిగింది.

శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనుల‌ను చేసి వివిధ ర‌కాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. రంగు రంగుల ఆర్కిడ్ పుష్పాలల‌తో వేదిక‌ను సుంద‌రంగా తీర్చి దిద్దారు.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్య హవచనం, ముఖ ప్రక్షాళన, ధూప దీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్య పాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖ నిధి, పద్మ నిధి, సహస్ర ధార, కుంభ ధారణలతో వైఖానస ఆగమ యుక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుష సూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేద పారాయణదారులు పారాయణం చేశారు.

అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఏలకులు, వట్టి వేరు, బాదం, వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, చంద‌నం, న‌ల్ల ద్రాక్ష, రోజ్ పెట‌ల్స్‌. తులసి దండలు స్వామి అమ్మ వార్లకు అలంకరించారు.

టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేశారు. ఒక్క టన్ను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, పండ్లు, లతలతో వేదికను శోభాయమానంగా అలంకరించడమే కాకుండా శ్రీ మలయప్ప స్వామి వారికి రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెన్నైకి చెందిన దాత ఈ మాలలను విరాళంగా అందించారు.