రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలి
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి
హైదరాబాద్ – సినీ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఏకంగా 50 ఏళ్ల పాటు స్వయం కృషితో అనేక సంస్థలను ఏర్పాటు చేయడమే కాకుండా అభివృద్ది పథంలోకి తీసుకు వెళ్లిన ఘనత రామోజీ రావుకే దక్కుతుందన్నారు.
ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కల్పించిన అరుదైన వ్యక్తి అని కొనియాడారు ఎస్ఎస్ రాజమౌళి. ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్ల పాటు ఇటు పత్రికా రంగానికి , వినోద రంగానికి ఎనలేని సేవలందించినందుకు గాను రామోజీ రావుకు భారత రత్న ప్రదానం చేయాలని కోరారు. ఆయనకు ఇచ్చే అరుదైన నివాళి ఇదేనని స్పష్టం చేశారు రాజమౌళి.
రామోజీరావు శనివారం తెల్ల వారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చ లేనిదని పేర్కొన్నారు.