భారత దేశం గర్వించ దగిన మానవుడు
హైదరాబాద్ – ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. తనను ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తులలో రతన్ టాటా ఒకరని పేర్కొన్నారు.
కాల గమనంలో ఎందరో వస్తుంటారని కానీ కొందరే చెరగని ముద్ర వేస్తారని , అలాంటి కోవకు చెందిన అరుదైన మహోన్నత మానవుడు రతన్ నావల్ టాటా అని ప్రశంసించారు ఎస్ఎస్ రాజమౌళి. ఆయనకు మరణం లేదు. కోట్లాది మంది ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.
టాటా ఉత్పత్తిని ఉపయోగించకుండా ఒక రోజును ఊహించడం కష్టం… రతన్ టాటా వారసత్వం నిత్య జీవితంలో ఇమిడి పోయిందన్నారు ఎస్ఎస్ రాజమౌళి. పంచ భూతాలతో పాటు ఎవరైనా కాలపరీక్షకు నిలబడతారంటే అది ఆయనే అని పేర్కొన్నారు.
భారతదేశం కోసం మీరు చేసిన ప్రతిదానికీ, లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేసినందుకు ధన్యవాదాలు సర్. మీరు తరతరాలుగా నిలిచి పోయే గుర్తును మిగిల్చారు. నీకు వందనం… ఎల్లప్పుడూ నీ ఆరాధకుడు… జై హింద్ అంటూ పేర్కొన్నారు దిగ్గజ దర్శకుడు.